“ఈ నియంత మాకొద్దం”టూ పద్దెనిమిది రోజుల పాటు ఎండా, వాన తెలియకుండా, రాత్రీ పగలూ తేడా చూడకుండా వీధుల్లోనే భార్యా బిడ్డలతో సహా గడిపి ఈజిప్టు పౌరుడు ఆందోళనలో పాల్గొని నియంత ముబారక్ ను దేశం నుండి సాగనంపాడు. వారి ప్రధాన కోరిక అయిన ప్రజాస్వామ్య పాలన ఇంకా దేశంలో ఏర్పడలేదు. ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ఎమర్జెన్సీ చట్టంతో తమని పాలించటానికి ఏ శక్తి సాయం చేసింది?
దేశంలో సైన్యమే ముబారక్ కు అండదండలిచ్చి కాపాడితే, దేశం బయటనుండి అమెరికా సంవత్సరానికి 1.3 బిలియన్ డాలర్లు అందిస్తూ ముబారక్ నాయకత్వంలోని ఈజిప్టుకు నైతిక మద్దతును అందించింది. ఆశ్చర్యకరంగా ముబారక్ ముప్ఫై సంవత్సరాల పాటు ప్రజలనూ, ప్రతిపక్షాలనూ అణచివేస్తూ పాలించటానికి మద్దతునిచ్చిన ఈ రెండు శక్తులే ఈ రోజు ముబారక్ అధికారం త్యజించటానికి ప్రధాన కారకులుగా మిగిలారు.
తాము పద్దెనిమిది రోజుల పాటు అహింసాయుతంగా పోరాటం చేయటం వల్లనే ముబారక్ ను గద్దె దింప గలిగామని ఆందోళనకారులు నమ్ముతున్నారు. అదే నిజమని అంతర్జాతీయ పత్రికలన్నీ రాస్తున్నాయి. ప్రజల శక్తికి తిరుగులేదని సోదాహరణంగా వ్యాసాలను అవి ప్రచురిస్తున్నాయి. కొన్ని, ప్రజలే చరిత్ర నిర్మాతలని కూడా అంటున్నాయి. ఒక నియంత నేలకూలాడని ముబారక్ ను తిట్టి పోస్తున్నాయి. ప్రజలను రాచి రంపాన పెట్టాడని శాపనార్ధాలు పెడుతున్నాయి. అయితే ప్రజలు ఉద్యమించే వరకు ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ప్రజాందోళనకు ముందు ముబారక్ నియంత అనీ, మూడు దశాబ్దాలు ప్రజలను ప్రతిపక్షాలను అణచివేశాడనీ వాటికి తెలియదా?
ఆందోళన సాగినన్నాళ్ళూ ఆందోళన చేస్తున్న ప్రజల పట్ల చాలా మర్యాదకరంగా ప్రవర్తించిందని ఈజిప్టు సైన్యాన్ని పత్రికలు, పరిశీలకులు, ప్రభుత్వాలు, ప్రభుత్వ పాలకులు, మేధావులు, సామన్యులు ఒకరని కాకుండా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ముబారక్ గద్దె దిగాక ప్రజలు ఆనందోత్సాహాలతో సైనికులతో కలిసి ఆడి పాడారనీ, వారితో కలిసి ఫోటోలు దిగి వాటిని, “ఒక చారిత్రక దినాన తామూ పాత్రధారులులుగా ఉన్నామనడానికి” గుర్తుగా ఆ ఫొటోలను భద్రపరుచుకుంటున్నారని వార్తా సంస్ధలు రాస్తున్నాయి.
సైన్యం, ఈజిప్టు ప్రజా విప్లవంలో, ఎన్నడూ లేనట్లుగా, ఒక అసాధారాణ చారిత్రాత్మక పాత్ర నిర్వహించిందని వేన్నోళ్ళా కీర్తిస్తున్నాయి. సైన్యమే దేశాన్ని రక్షించాలని విప్లవ నాయకుడు ఎల్ బరాదీ ట్విట్టర్ లో రాసుకుని సైన్యానిదే విప్లవంలో కీలక పాత్ర అని చాటి చెప్పాడు. వీళ్ళందరికి ముబారక్ నియంతృత్వ పాలనను కంటికి రెప్పలా కాపాడింది సైన్యమేనని తెలియదా? ఈ రోజు తమ పోషకుడు అమెరికా దిశా నిర్దేశం మేరకు ఆందోళనకారుల జోలికి రానంత మాత్రాన సైన్యం ప్రజాస్వామ్య పరిరక్షకురాలిగా ఒక్కసారిగా ఎలా మారిపోయింది?
అమెరికా! ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్యం కొరవడినా అక్కడకు పిలవక పోయినా వెళ్ళి నియంతలను నేల కూల్చి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని తనకు తానే గొప్పలు చెప్పుకునే నిఖార్సయిన ప్రజాస్వామిక పరిరక్షకురాలు. ముప్పై సంవత్సరాలు తానె పాలు పోసి పెంచిన విష పురుగుని “అబ్బే, విష పురుగు” అని విదిలించి పారేసింది. ఇన్నాళ్ళూ నమ్మకమైన ముతృడుగా ప్రశంసించి ఆయుధాలూ, డబ్బూ అందించి, తన దత్త పుత్రిక ఇజ్రాయెల్ ను తోటి అరబ్ ఇస్లాం అతివాదులనుండి కాపాడుతూ వచ్చినందుకు భుజం తట్టి నిలిపిన ముబారక్ ను అయిష్టంగానయినా సాగనంపిన అమెరికా నిజంగా ఈజిప్టు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు విలువనిస్తున్నదా?
ఒఠ్ఠిమాట! అమెరికాకి కావలసింది నమ్మకంగా అధికారానికి అంటిపెట్టుకుని ప్రజలను ప్రత్యామ్నాయ రాజకీయాల జోలికి పోకుండా నియంత్రించ గలిగిన ఒక సామంత పాలకుడు మాత్రమే. ముప్ఫై సంవత్సరాల పాటు తనకు కావలసిన పాత్రలో ఇమిడి ఒదిగి ఉన్నాడు కనుకనే ముబారక్ కు అన్ని రకాల మద్దతునిచ్చి కాపాడుకుంటూ వచ్చింది. ఈ రోజు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలు అమెరికా, దాని పశ్చిమ మిత్రుల అంచనాలను దాటి పోయాయి. ఒక వైపు ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ లలో సాగిస్తున్న యుద్ధంలో సర్వ శక్తులూ కోల్పోయి కుంటుతూ నడుస్తుందగా ఇక్కడ ముబారక్ చెంత చేరి ఉద్యమిస్తున్న ప్రజలతో తలపడే ఓపిక అమెరికాకు నశించింది. అనుకోకుండా తలెత్తిన సమస్యనుండి గౌరవంగా బైటపడటమే దానికి కావాలి. అదే సమయంలో తాను అశక్తురాలిగా మిగిలిన సంగతి బైట పడకూడదు. అందుకే ఆందోళన సాగినన్నాళ్ళూ ఒకరోజు ముబారక్ వైపు, మరో రోజు ఆందోళనకారుల వైపు మాట్లాడుతూ ఎటు నిలిస్తే తన మాట దక్కుతుందో అర్ధం కాక సతమవుతూ గడిపింది. చివరకు ఆందోళనకారులు లొంగేలా లేరని అర్ధమయ్యాక, ముబారక్ కి మద్దతు ఇచ్చినా నిలిచే పరిస్ధితి లేదని గ్రహించాక వ్రతం చెడ్డా ఫలితం దక్కించుకోవాలనే దుర్భుద్ధితో ఈజిప్టు ప్రజలకు మద్దతు నిచ్చినట్లుగా ఒక ఫోజు పెట్టింది.
ముబారక్ దిగిపోయినప్పటికీ తాము అతను కుదుర్చుకున్న ఒప్పందాల నన్నింటినీ యధావిధిగా గౌరవిస్తామని సైన్యం ప్రకటించింది. దానర్ధం ప్రజలు కోరుకున్నది వారికి దక్కబోవటం లేదనే. ముబారక్ నియంత అని నమ్మితే అతను కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షిస్తామని ప్రకటించాలి. ముబారక్ అనుసరించిన విదేశాంగ విధానాన్ని సమీక్షిస్తామని ప్రకటించాలి. ప్రజలదే అధికారం అయితే ఎన్నాళ్ళలో ఎన్నికలు నిర్వహించబోతున్నారో ప్రకటించాలి. అధికారాన్ని మిలటరీ కౌన్సిల్ కి కాకుండా ప్రజల మద్దతు ఉన్న నాయకులతో ఏర్పడిన కమిటీ కో లేక అలాంటిదానికో అప్పగించాల్సి ఉంది. కాని అలా జరగలేదు. కనుక ప్రజల డిమాండ్లు ప్రస్తుతానికి బొంద పెట్టినట్లే.