కేవలం నెలరోజుల కంటే తక్కువ వ్యవధిలోనే ఇద్దరు ఆఫ్రికా నియంతలు నేల కూలారు. సైన్యం ఆందోళన కారులకు వ్యతిరేకంగా మద్దతు ఇయ్యలేమని తెలియజేయటంతో ట్యునీషియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన 27 రోజుల్లోనే ఈజిప్తు అధ్య్క్షుడు ముబారక్ సైతం అవే పరిస్ధితుల నడుమ అధికారన్ని త్యజించక తప్పలేదు. పద్దెనిమిది రోజుల ఆందోళనల అనంతరం ముబారక్ తలొగ్గాడు. అధ్యక్ష పదవికి రాజీనామా చేసి సైన్యానికి బాధ్యతలు అప్పగించినట్లుగా వార్తా సంస్ధలు తెలిపాయి. ఉపాధ్యక్షుడు సులేమాన్ ఈ మేరకు టీవీలో ఓ ప్రకటన చదివి వినిపించాడు.
తాహ్రిర్ స్క్వేర్ లో హోస్ని ముబారక్ రాజీనామాను డిమాండ్ చేస్తూ పద్దెనిమిది రోజులనుండి గడుపుతున్న ఆందోళనకారులు ఈ వార్వ విని ఆనందోత్సాహాలల్లో మునిగి తేలారు. వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కళ్ళల్లో ఆనంద భాష్పాలు నింపుకుని ఒకరినొకరు కౌగలించుకుని అభినందనలు తెలుపుకున్నారు.
అధికారాన్ని సైన్యానికి అప్పగించి ఎర్ర సముద్రంలో షర్మ్ ఎల్-షేక్ లో ఉన్న తమ విడిది ఇంటికి ముబారక్ కుటుంబం వెళ్ళినట్లుగా తెలుస్తోంది. అత్యున్నత మిలిటరీ కౌన్సిల్ కు అధికార బాధ్యతలు నిర్వహిస్తుందని, ప్రజల డిమాండ్లను నెరవేర్చే బాధ్యతను తీసుకుంటుందననీ సులేమాన్ తెలియజేశాడు. ముబారక్ భవితవ్యం గురించి వివరాలేమీ తెలియలేదు.
ఒక విదేశీ వ్యాఖ్యాత రాయటర్స్ వార్తా సంస్ధ వెబ్ సైట్ లో ఒక వ్యాఖ్యానం వదులుతూ “హమ్మయ్య! ఎలాగైతేనేం. ఒక రక్తపాత రహిత కుట్ర (బ్లడ్ లెస్ కూప్) ముగిసింది” అని నిట్టూర్పు విడిచాడు. ఆయన తెలిసి అన్నాడో తెలియకుండానే అన్నాడోవాని అది మాత్రం అక్షరాలా నిజం.
ప్రజలు ఒకందుకు ఆందోళనలో పాల్గొంటే వారికి మద్దుతు ఇచ్చిన వారికి మాత్రం వివిధ కారణాలు ఉన్నాయి. ఎవరి కారణాలు వారికి ఉన్నా ప్రజల ఆకాంక్షలతో ఏకీభవించే వారు మాత్రం చాలా తక్కువ మందే ఉండి ఉండాలి. ప్రజలకు కావలిసింది వారి దైనందిన సమస్యలు పరిష్కారం కావటం. వారికి చదువులు కావాలి. చేయటానికి ఉద్యోగాలు కావాలి. నివసించటానికి సౌకర్యవంతమైన ఇల్లు కావాలి. తినటానికి సరిపోయినంత తిండి కావాలి. ఇవేమీ పెద్ద కోరికలు కావు. కానీ ఆ చిన్న కోరికలు తీర్చే పేరుతోనే యుగాల తరబడి వారిని ఊరిస్తూ, వారి పోరాట శక్తినే ఉపయోగించుకుని అధికారాన్ని సంపాదించి ఆనక తాము అధికారాన్ని సంపాదించటానికి ఉపయోగించుకున్న సామాన్య ప్రజానీకాన్ని నిలువునా వంచిస్తూ, వారి మానాన వారిని వదిలేసి తాము మాత్రం బిలియన్ల కొద్దీ సంపదను కూడబెట్టుకునే వారే తమకు నాయకత్వం వహించారనీ, వారే రూపం మార్చుకుని తమ మీద స్వారీ చేయనున్నారని ప్రజలకు కొంత కాలం వరకు తెలియక పోవచ్చు.