ద్రవ్యోల్బణం అదుపు కోసం బ్రెజిల్ పొదుపు ప్రయత్నాలు


 

Dilma Rousseff

బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్

ద్రవ్యోల్బణం అదుపు, కోశాగార స్ధిరీకరణ (ఫిస్కల్ కన్సాలిడేషన్) పేరుతో ప్రజల సంక్షేమం కోసం పెట్టే ఖర్చులో కోతలు విధించడానికి బ్రెజిల్ ప్రభుత్వం కూడా సిద్ధపడినట్లు కనిపిస్టోంది. పెరిగి పోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటానికి 50 బిలియన్ల రియళ్ళ (రియల్ అనేది బ్రెజిల్ కరెన్సీ) మేరకు ఖర్చులు తగ్గిస్తామని బ్రెజిల్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన పొదుపు మొత్తం  30 బిలియన్ డాలర్లకు సమానం.

 

ఆర్ధిక సంక్షోభం పుణ్యాన అభివృద్ధి చెందిన దేశాలతో పాటు చైనా, బ్రెజిల్, ఇండియా లాంటి ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ (ఇ.ఎం.ఇ) లు గల దేశాలు కూడా పెద్ద ఎత్తున ఆర్ధిక వ్యవస్ధలను ప్రేరేపించే ఆర్ధిక చర్యలను అమలు పరిచాయి. ప్రభుత్వ సొమ్మును పెద్ద ఎత్తున మార్కెట్ ల లోకి కుమ్మరించటం, కంపెనీలు చెల్లించవలసిన పన్నులు తగ్గించటం, సరుకులు విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు ఎగుమతి ప్రోత్సాహకాలు అందింఛటం వాటిలో ముఖ్యమైనవి. ఈ చర్యల వలన దేశాల ఆర్ధిక వ్యవస్ధలతో పాటు ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధ కూడా సంక్షోభం నుండి త్వరగా బయట పడ్డాయని ఆర్ధిక వేత్తలు, ప్రభుత్వాల అభిప్రాయం.

సంక్షోభం నుంచి బయట పడ్డాయో లేదో గానీ ఉద్దీపన పేరుతో కుమ్మరించిన డబ్బుల వలన ఆయా దేశాల్లో, ముఖ్యంగా ఇ.ఎం.ఇలలో ద్రవ్యోల్బణం కట్టలు తెంచుకుంది. దాన్ని కట్టడి చేయటానికి అక్కడి ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్నారు. చైనా రెండు సార్లు వడ్డీ రేట్లు పెంచడంతో పేటు బ్యాంకులు సెంట్రల్ బ్యాంకు వద్ద రిజర్వులో ఉంచ వలసిన డిపాజిట్ల శాతాన్ని అనేక సార్లు పెంచింది. చైనాలో ప్రాపర్టీ బుడగ బద్దలు కాకుండా ఉండటానికి అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు ఇప్పటికే తీసుకొంది. అయినా బుడగ భయం మాత్రం పూర్తిగా పోనే లేదు.

ఇండియా కూడా వడ్డీ రేట్లతో పాటు సి.ఆర్.ఆర్, రెపో, రివర్స్ రెపో రేట్లను ఇప్పటికి అనేక సార్లు పెంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయటానికి ప్రయత్నించింది. ఇండియాలో దాదాపు అన్ని సరుకుల రేట్లు విపరీతంగా పెరిగి పోయి ప్రజలు నానా అవస్ధలు పడుతున్నారు. బ్రెజిల్, చైనాల్లో సైతం రియల్ ఎస్టేట్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు సైతం అందుబాటులో లేవు.

పాత అధ్యక్షుడు లూలా డిసిల్వా నుండి అధికార పగ్గాలు చేపట్టిన ఆయన శిష్యురాలు “దిల్మా రౌసెఫ్” పైన లూలా అనుసరించిన తేలిక పాటి అర్ధిక విధానాలను పటిష్ట పరచి బ్రెజిల్ ఆర్ధిక వ్యవస్ధను గాడిలోకి పెట్టే భారం పడింది. అందులో భాగంగానే ముప్ఫై బిలియన్ డాలర్ల మేరకు ఖర్చులు తగ్గిస్తామని ప్రకటించింది. యాభై బిలియన్ రియళ్ళ బదులు డెబ్భై బిలియన్ రియళ్ళ మేరకు పొదుపు చర్యలు ప్రకటించి ఉంటే బాగుండేదని అక్కడి పరిశ్రమల ప్రతినిధి కోరాడు.

పొదుపు చర్యలు అంటే ప్రభుత్వం పేట్టే ఖర్చులను తగ్గించటం గా చెబుతారు. పొదుపు అనగానే సాధారణంగా దేశంలోని సాధారణ ప్రజల పైన పెట్టే సంక్షేమ కార్యక్రమాల ఖర్చులను తగ్గించడానికే ప్రధమ ప్రాధాన్యం ఇస్తాయి. అవి తప్ప సమాజంలోని ఉన్నత వర్గాల పైన పెట్టే ఖర్చును తగ్గించటానికి ఏ ప్రభుత్వమూ ప్రయత్నించిన దాఖలాలు లేవు. ఉన్నత వర్గాల పైన పెట్టే ఖర్చంటే ప్రధానంగా పెట్టుబడిదారులకు, వ్యాపారవేత్తలకు ఇచ్చే ఋణాలు, ఆ ఋణాల పైన వడ్డీలు, పెట్టుబడిదారులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీలు, ఉత్పత్తులు చేయటానికి ఇచ్చే సబ్సిడీలు, చేసిన ఉత్పత్తిని అమ్ముకోడాని ఇచ్చే ప్రోత్సాహకాలు, నానా రకాల పేర్లతో ఇచ్చే అప్పులు, గతంలో ఇచ్చిన అప్పుల రద్దు… ఇవన్నీ ఉంటాయి. అవన్నీ బిలియన్ల లోనో, కోట్ల లోనో ఉంటాయి తప్ప వందలు వేలు కాదనేది స్పష్టమే. వీటిలో దేనినీ పొదుపు పేరుతో ముట్టుకోవటానికి ఏ ప్రభుత్వమూ సాహసించదు.

పొదుపు ఆంటే సామాన్య ప్రజల కోసం పెట్టే సంక్షేమ కార్యక్రమాల ఖర్చులొ కోత విధించడమే. గత సంవత్సర కాలంగా యూరప్ లోని పెద్దా, చిన్నా దేశాలన్నీ పొదుపు చర్యలు అమలు చేస్తున్నాయి. అక్కడ ప్రజల కోసం పెట్టే ఖర్చులన్నింటినీ దారుణంగా తగ్గించేశారు. విద్య, వైద్యం, ఉపాధి, వృద్ధాప్య పెన్షన్లు, నిరుద్యోగ భృతి ఇలా ఏదీ మిగల్చకుండా అన్నింటి పైనా బడ్జెట్ కేటాయింపులను తగ్గించేశారు. విధ్యార్ధుల ఫీజులను పెంచారు. విద్యార్ధులకిచ్చే ఫీజుల సబ్సిడీలను తగ్గించారు. కార్పొరేషన్, మునిసిపాలిటీల లాంటి స్ధానిక ప్రభుత్వాలు పాఠశాలలు, కాలేజిల పైన పెట్టే ఖర్చులను వృధా ఖర్చులుగా భావిస్తున్నాయి. వైద్యం కోసం ఇచ్చే ప్రభుత్వ మద్దతును పూర్తిగా తగ్గించడమో, అసలు ఎత్తేయటమో చేశాయి, ఇంకా చేస్తునాయి. టీచర్లను, లెక్చరర్లను ఇంటికి పంపిస్తున్నారు. లైబ్రరీలు, ప్రయోగశాలలు మూసివేస్తున్నారు.

కాని బ్యాంకుల సి.ఇ.ఓ లకు ఇతర ఉన్నతాధికారులకు మిలియన్లలో ఇచ్చే బోనస్ మొత్తాలను తగ్గించటానికి మనసొప్పటంలేదు. ఇంగ్లండ్ లాంటి చోట్ల బోనస్ లు తగ్గించినట్లు ప్రకటించి ఆ మేరకు జీతాలను పెంచేశారు. కొన్ని బ్యాంకులు బోనస్ లు పెంచి వాటి చెల్లింపును వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. సి.ఇ.ఓ లు జెట్ విమానాల్లో ప్రయాణించటం లాంటి విలాసాలు ఏ మాత్రం తగ్గలేదు. కొన్ని కంపెనీలు, బ్యాంకులు సి.ఇ.ఓలు మరో బ్యాంకుకుగానీ, కంపెనీకి గానీ వలస వెళ్ళకుండా ఉండాలంటే బోనస్ లు ఇవ్వటం తప్పదని బహిరంగంగా నిస్సిగ్గుగా ప్రకటిస్తున్నారు.

ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు పెట్టే ఖర్చులు ఈ పొదుపు వలన ఏమీ తగ్గవని బ్రెజిల్ ఆర్ధిక మంత్రి ప్రకటించినప్పటికీ అధి ప్రకటనల వరకే పరిమితం అవుతుందనడంలో ఎట్టి సందేహమూ అనవసరం. కోతలు విధించడానికి ప్రభుత్వాలకు అనేక రహస్య పద్ధతులు ఉంటాయి. పైకి తగ్గించ కుండానే పరోక్షంగా ఏదో ఒక పద్ధతిలో బడ్జెట్ లో హామీ ఇచ్చిన ఖర్చును ఎగ్గొట్టే అవకాశం ఉంటుంది. కేటాయింపులు ఘనంగా ఉంచుతూనే వసూళ్ళు లేవనే పేరుతో మొదట వాయిదా వేయటం, ఆ తర్వాత పూర్తిగా వదిలివేయటం చేయవచ్చు. లబ్దిదారుల సంఖ్యను చెప్పకుండా తగ్గించవచ్చు. తమ సుదీర్ఘ అనుభవంలో ప్రభుత్వాలు ప్రజలను మోసం చేయటంలో రాటు దేలాయి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s