స్ధూలంగా చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలో కొన్ని దేశాలు మిగిలిన వాటికంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయనీ, కనుక మిగిలిన అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలతో వాటిని కలిపి చూడకుండా విడిగా చూడటం కోసం “ఎమర్జింగ్ దేశాలు” అనే పదాన్ని చేర్చారని దాదాపు ఆందరూ భావిస్తున్నారు. ఎమర్జింగ్ అనే పదం కూడా అలా భావించటానికి ప్రోత్సాహం ఇచ్చేదిగానే ఉంది. వాస్తవానికి అది సరైనది కాదు.
తూర్పు యూరప్ లోని కొన్ని దేశాలను కూడా ఎమర్జింగ్ దేశాలని సంబోధిస్తున్నారు. అవి నిజానికి చైనా, ఇండియా, బ్రెజిల్, ఆస్ట్రేలియా మొదలైన దేశాలకు దీటుగా ఉన్న దేశాలు కావు. అయినా వాటిని కూడా ఎమర్జింగ్ దేశాలని ఎందుకు అంటున్నారు? రష్యా ఒకప్పుడు అగ్ర రాజ్యం. ఇప్పుడు అగ్ర రాజ్యం కాక పోయినా అభివృద్ధి చెందిన దేశమే. అయినా దానిని అభివృద్ధి చెందిన దేశంగా మిగల్చకుండా ఎమర్జింగ్ దేశంగా ఎందుకు పిలుస్తున్నారు? రష్యాను, ఇండియా చైనాలతో ఎందుకు చేర్చవలసి వచ్చింది? వీటికి సమాధానం ఇది.
“ఎమర్జింగ్ దేశాలు” అనేది నిజానికి పూర్తి పదం కాదు. “ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీస్” అనేది అసలు పదం. దాన్ని సంక్షిప్తం చేసి ఎమర్జింగ్ దేశాలు అంటున్నారని అనుకుంటున్నారేమో తెలియదు కానీ ఆ సంక్షిప్త పదం, కొత్త వర్గీకరణకు అసలు అర్ధం తెలియకుండా మరుగు పరిచేదిగా ఉందని చెప్పుకోవచ్చు.
అయితే “ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ”లు అంటే ఏమిటి? ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీ అనే పద బంధాన్ని, ఎమర్జింగ్ ‘మార్కెట్ ఎకానమీ’ గా చూడాలి. అంటే మొదటి పదం ఒకటి గానూ మిగిలిన రెండు పదాలను ఒకటిగానూ చూస్తూ వాటి అర్ధాన్ని పరిశీలిస్తే దాని అసలు అర్ధం సులభంగా అర్ధం అవుతుంది. అలా చూసినపుడు వచ్చే అర్ధం “అభివృద్ధి చెందుతున్న ‘మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలు'” అని. అంటే ఈ వర్గం కింద పేర్కొనే దేశాలు ఇప్పుడు “మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలు” గా రూపాంతరం చెందుతున్నాయని అర్ధం.
అయితే ఇవి ఇన్నాళ్ళూ మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధలుగా లేవా? అన్న ప్రశ్నకు సమాధానం “లేవు” అనే. మరి ఏవిగా ఉన్నాయి అని ప్రశ్నిస్తే దానికి సమాధానం అవిన్నాళ్ళూ “ప్రణాళికా బద్ధ ఆర్ధిక వ్యవస్ధలుగా (ప్లాన్డ్ ఎకానమీస్)” ఉన్నాయని సమాధానంగా చెప్పాలి. నిన్న మొన్నటి వరకూ ఈ దేశాల్లో మార్కెట్ అనేది ప్రధాన పాత్రదారుగా వ్యవహరించలేదు. ప్రభుత్వమే మార్కెట్ లో ప్రధాన పాత్రదారుగా ఉండేది. నిర్ధిష్టంగా చెప్పాలంటే ఇండియాలో 1990లో నూతన ఆర్ధిక విధానాలను అమలు చేయటం ప్రారంభం ఐన దగ్గరనుండీ, రష్యాలో 1990లో గోర్బచెవ్ ప్రభుత్వం కూలిపోయి, ఎల్ట్సిన్ అధికారం చేపట్టినప్పటి నుండీ అక్కడ మార్కెట్ విధానాలు ప్రారంభం అయ్యాయి.
చైనాకి సంబంధించి ఖచ్చితమైన గీత గీయటం కొంత కష్టంగా ఉంటుంది. అక్కడి కార్మిక వర్గ విప్లవానికి నాయకత్వం వహించి 1976 వరకూ ఉన్న మావో సే టుంగ్ నాయకత్వంలో చైనాలో సోషలిస్టు వ్యవస్ధను స్ధాపించటానికి కృషి జరిగింది. ఆయన చనిపోయాక సోషలిస్టు వ్యవస్ధ నిర్మాణాన్ని ఆపేసి డెంగ్ గ్జియావో పింగ్ నాయకత్వంలో మళ్ళీ పెట్టుబడిదారీ వ్యవస్ధ వైపుకి తిరుగు ప్రయాణాన్ని చైనా ప్రారంభించింది. అప్పటినుండీ ఇప్పటి వరకూ ఆ ప్రయాణం సాగుతూనే ఉంది. ఇప్పుడు అక్కడ ప్రైవేటు కంపెనీలు బలపడినప్పటికీ, పెడుబడిదారీ వ్యవస్ధ స్ధిరపడినప్పటికీ మార్కెట్లో ప్రభుత్వ పాత్ర ఇంకా గణనీయంగానే ఉంది. ఇండియా, రష్యా దేశాల్లాగా ఒక మలుపు లాంటి ప్రారంభం అక్కడ డెంగ్ ప్రారంభించిన సంస్కరణలే.
మార్కెట్ పాత్ర పెరిగినప్పటికీ ఈ దేశాల్లో పూర్తిగా మార్కెట్ కే అన్నింటినీ వదిలేయలేదు, అమెరికాలో లాగా. ప్రభుత్వం తన పాత్రను పూర్తిగా వదులుకోలేదు. అదింకా నిర్ణయాత్మక పాత్రను నిర్వహిస్తూనే ఉంది. అయితే వాటి ప్రయాణం అటు వైపే ఉంది. అది పూర్తి కావటానికి ఇంకా చాలా కాలం పట్టవచ్చు. ఈ దేశాల ప్రధాన పెట్టుబడిదారీ వర్గాలకు ప్రభుత్వ కంపెనీలతో (పబ్లిక్ సెక్టార్) దశాబ్దాల అనుబంధం ఉంది. ప్రభుత్వ కంపెనీల భాగస్వామ్యం ద్వారానే వాళ్ళు కుబేరులయ్యారు మరి. ఆ అనుబంధాన్ని వదులుకోలేని కొన్ని వర్గాలకు ఉన్న బలాన్ని బట్టి “మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధ” వైపు వాటి ప్రయాణం కొన్ని దేశాల్లో వేగంగా, కొన్ని దేశాల్లో నెమ్మదిగా సాగుతోంది.