మా కంపెనీ పోటీదారులు కంపెనీకి వ్యతిరేకంగా పనిగట్టుకుని మరీ ఆధార రహితమైన పుకార్లు వ్యాపింప జేస్తున్నారనీ అందుకే మా గ్రూపు (అడాగ్) కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా
పడి పోతున్నాయనీ అనీల్ అంబానీ తెలిపినట్లుగా రాయటర్స్ వార్తా సంస్ధ తెలిపింది. అ పోటీదారుల పేర్లను అనీల్ వెల్లడించలేదు. మా కంపెనీల షేర్లను అస్ధిరం కావించటం ద్వారా మార్కెట్లో భయాందోళనలను సృష్టించాలని చూస్తున్నారని అనిల్ ఆరోపించాడు.
కొత్త సంవత్సరం ప్రారంభం ఐనప్పటునుండి ఇండియా షేర్ మార్కెట్ లో దాదాపు అన్ని కంపెనీల షేర్లు పడి పోతున్నాయి. ఒక దశలో ఇరవై వేలు మార్కు దాటిన సెన్సెక్స్ సూచి బుధవారం, ఫిబ్రవరి 9 తేదీ సెషన్ ముగిసే నాటికి 17,592 వద్ద క్లోజయ్యింది. అంటే దాదాపు 2,400 పైనే కోల్పోయింది. నియంత్రణలోకి వస్తుందని చెప్పిన ద్రవ్యోల్బణం ఇందా 8.5 శాతం పైనే ఉండటం, దానితో విదేశీ సంస్ధాగత ఇన్వెస్టర్లు (ఎఫ్.ఐ.ఐ లు) తమ డబ్బును ఇండియా షేర్లనుండి ఉపసంహరించుకుంటుండటంతో షేర్లు పడి పోతున్నాయజి విశ్లేషకులు భావిస్తున్నారు. వరుసగా వెల్లడౌతున్న కుంభకోణాలు కూడా షేర్ల పతనంలో తమ పాత్ర నిర్వహిస్తున్నాయని రాయటర్స్ అభిప్రాయ పడింది.
టెలికం కుంభకోణంలో ఉన్న శ్వాన్ అనే కంపెనీలో అనీల్ పెట్టుబడులు ఉన్నప్పటికీ దానికి ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందని కాగ్ విమర్శించింది. లైసెన్సులు జారీ అయ్యే నాటికి తనకు శ్వాన్ లో వాటాలేమీ లేవని అనీల్ చెబుతున్నాడు. బుధవారం డిబి రియాలిటీ సంస్ధ చైర్మన్ షాహిద్ బల్వాను భారత అధికారులు నిర్బంధం లోకి తీసుకోవటంతో దాని షేర్లు 20 శాతం పైనే పడిపోయాయి. అబూదాబికి చెందిన ఎతిసలాత్ కంపెనీతో కలిసి స్ధాపించిన భారత అనుబంధ సంస్ధకు కూడా షాహిద్ వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఆ సంస్ధ టెలికం లైసెన్స్ ల కుంభకోణంలో పాత్రదారుగా ఆరోపణ ఎదుర్కొంటోంది.
ఇటువంటి ప్రతికూల వాతావరణంలో పుకార్లు ప్రచారం కావటానికి అవకాశం ఉంటుందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. రిలయన్స్ లాంటి కంపెనీలపై వచ్చే పుకార్ల ప్రభావం కొంచెం ఎక్కువ గానె ఉంటుందని వారి ఉవాచ. ఉద్దేశపూర్వక పుకార్ల విషయమై తాను షేర్ మార్కెట్ నియంత్రణా సంస్ధ సెబికి ఫిర్యాదు చేశానని అనిల్ తెలిపాడు. తమకింకా అటువంటి ఫిర్యాదు ఏదీ ఆందలేదని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ తెలిపినట్టు సమాచారం.
ఎమర్జింగ్ మార్కెట్ ఎకానమీల్లో ఇండియా సహచురులయిన చైనా, బ్రెజిల్ లలో తగ్గుదల ఇండియా కంటే చాలా తక్కువగా ఉండగా రష్యా, ఆస్ట్రేలియాల షేర్ మార్కెట్లు కొత్త సంవత్సరంలో సైతం లాభాల్లో కొన సాగుతున్నాయి. ఇండియానుండి దాదాపు ఒక బిలియన్ డాలర్ల పైనే ఎఫ్.ఐ.ఐలు ఉపసంహరించుకున్నట్లుగా మంగళవారం బిబిసి తెలిపింది. జిడిపి పెరుగుదల రేటు రెండంకెలకు త్వరలో చేరుకుంటామని ప్రకటనలు గుప్పిస్తున్న మన్మోహన్ నాయకత్వం లోని మార్కెట్ అనుకూల శక్తులకు షేర్ల పతనం మింగుడు పడని విషయమే. రానున్న బడ్జెట్ తోనైనా పతనం ఆగుతుందని మదుపుదారులు, విశ్లేషకులు గంపెడాశలు పెట్టుకుని ఉన్నారు.