గత నాలుగు సంవత్సరాలుగా అనేక చిన్నా పెద్దా కుంభకోణాలతో యమ బిజీగా ఉన్న మన్మోహన్ ప్రభుత్వం మరో భారీ కుంభకోణానికి తెర లేపి రెడ్ హేండెడ్ గా దొరికిపోయింది. ఈసారి
చాలా ముందుగానే బయట పడటంతో దేశ ఖజానా మీదనే కన్నేసిన ఓ భారీ బందిపోటు దోపిడీ తప్పిపోయింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ (ఇస్రో) వాణిజ్య విభాగంమైన ఆంత్రిక్స్ సంస్ధ బెంగుళూరు కేంద్రంగా గల ఒక ప్రైవేటు కంపెనీకి అరుదైన ఎస్-బ్యాండు స్పెక్ట్రంలో కొంత భాగాన్ని ఉచితంగా ఇచ్చే ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇంగ్లీష్ జాతీయ పత్రిక ది హిందూ ఈ కుంభ కోణాన్ని గత సోమవారం బయట పెట్టింది. కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (సిఏజి – కాగ్), వేలం వేయకుండా ప్రైవేటు సంస్ధకు ఉచితంగా ఇవ్వటం వలన దేశ ఖజానాకు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాధమిక పరిశీలనలో తేలినట్లుగా తెలిపింది.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే టు – జి స్పెక్ట్రం కుంభకోణం వలన ఒక మంత్రి కూడా అరెస్టు అయి ఉన్న తరుణంలో మరో భారీ కుంభకోణం బయట పడటాన్ని తట్టుకోలేని పరిస్ధితుల్లో ఉండటంతో ముందుగానే మేల్కొని ఒప్పందం రద్దు చేసే ప్రయత్నాల్లో పడింది. ఉచితంగా స్పెక్ట్రంను పొందిన దేవాస్ మల్టీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్ధ, ఇస్రోలో మాజీ సైంటిఫిక్ సెక్రటరీ ఐన ఎం.జి.చంద్ర శేఖర్ కి చెందినది కావటం ఒక విశేషం. ఒప్పందం రద్దు వలన 500 కోట్ల రూపాయలు అపరాధ రుసుంగా చెల్లించ వలసి రావటం మరో విశేషం.
విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం నాకేమీ తెలీదు ఆంటోంది. ఎస్ – బ్యాండ్ స్పెక్ట్రం కేటాయించే నిర్ణయాన్ని తామింతవరకు తీసుకోనందున ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగే అవకాశమే లేదని ప్రధాని మంత్రి కార్యాలయం మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపింది. అంతరిక్ష విభాగం ప్రధాన మంత్రి పర్యవేక్షణలోనే ఉన్నందున ఆయన కార్యాలయం ప్రకటన చేసింది. ప్రభుత్వం కేటాయించ కుండానే ఆంత్రిక్స్, ప్రైవేటు కంపెనీ ఒప్పందం ఎలా కుదుర్చుకున్నదో, ఒప్పందం రద్దు కారణంగా ఐదు వందల కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లింపులు చేయాల్సిన అవసరం ఏంటో తెలియవలసి ఉంది. ఒప్పందం కుదిరినప్పటికీ ఆ విషయం ప్రభుత్వానికి చెప్పలేదని ఇస్రో చెబుతోంది. ఇది నష్ట నివారణా ప్రయత్నంగానే కనిపిస్తున్నది తప్ప అంత నమ్మదగినదిగా కనిపించటం లేదు. ఎందుకంటే, అరుదైన ప్రకృతి వనరును (స్పెక్ట్రం) ప్రైవేటు కంపెనీకి ఉచితంగా ధారపోసి ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పకుండా ఉండటం సాధ్యమేనా?
ఒప్పందం ప్రకారం దేవాస్ సంస్ధ కోసమే రెండు అంతరిక్ష ఉపగ్రహాలను (జిశాట్ ౬, జిశాట్ ౬ఎ) ఇస్రో నిర్మించవలసి ఊంది. ఈ రెండు ఉపగ్రహాల సామర్ధ్యంలో తొంభై శాతం దేవస్ సంస్ధ వినియోగానికై నిర్దేశించారు. అయితే ఇస్రో అంతర్గత ఆడిట్ సమీక్షలో దేవాస్ కు కేటాయించిన డెబ్భై మెగా హార్ట్జ్ ల స్పెక్ట్రం ప్రభుత్వ వినియోగనికి అవసరమని తేలటంతో జులై 2010 లోనే ఒప్పందం రద్దు చేయాలని నిర్ణయించామనీ ఇస్రో ప్రతినిధి తెలిపాడు. దేశ వ్యూహాత్మక అవసరాలతో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణ, కమ్యూనికేషన్స్, వైపరీత్యాల నిర్వహణ మొదలైన అవసరాలకు రెండు శాటిలైట్లు, దేవాస్ కు కేటాయించిన స్పెక్ట్రం అవసరమని సమీక్షలో తేలినట్లు ఆయన తెలిపారు.
మరో మహా మోసం నుండి భారత దేశ ప్రజల దృష్టి విజయవంతంగా మరలించ బడింది.