“ట్యునీషియా వ్యాపారవేత్త సొంత విమానంలో ప్రయాణం చేయటం నా తప్పే” అంటూ ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఇప్పుడు లెంపలు వేసుకుంటోంది. ఓ పక్కన టునీషియా ప్రజలను రెండున్నర
దళాబ్దాల పాటు నియంతలా పాలించిన అధ్యక్షుడు బెన్ ఆలీకి వ్యతిరేకంగా అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తూ పోలీసుల చేతిలో అనేక మంది చనిపోతుండగా అతని సన్నిహితుడయిన వ్యాపారవేత్తకి చెందిన ప్రైవేటు విమానంలో విహారయాత్రకు ట్యునీషియా బయలుదేరి రావటంతో ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఎలియట్ మేరీ ప్రపంచ వ్యాపితంగా అనేక విమర్శలు ఎదుర్కొంది.
అయితే తన విమాన ప్రయాణానికి ఆమె చెప్పిన కారణాలు మాత్రం అంత నమ్మ దగినవిగా లేక పోవటం విశేషం. తాను అప్పటికే బాగా అలసి పోవటం వలన రానున్న కష్టం గురించి ఊహించ లేక పోయానని ఆమె తెలిపింది. ఎంత బడలికగా ఉన్నా ప్రజల తిరుగుబాటు గురించి పట్టించుకోక పోవటం సాధ్యమేనా? ట్యునీషియాలో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుండడంతో మరి కొద్ది గంటల్లో అధ్యక్షుడు దేశం వదిలి పారిపోతాడనగా ఎలియట్ మేరీ, ట్యునీషియాలో తిరిగి మామూలు పరిస్ధితులు ఏర్పడటానికై ఫ్రాన్స్ సాయం చేయటానికి సిద్ధంగా ఉందని ప్రకటించిన విషయం గుర్తు చేసుకుంటే ఆమె అలసి పోయి ఉందో, తెలివిగా ఉందో ఇట్టే అర్ధం అవుతుంది.
అదీ కాక ట్యునీషియా అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయిన తర్వాత కూడా ఆమె మళ్ళీ రెండో సారి అదే విమానంలో ప్రయాణించిన విషయాన్ని ఫ్రాన్స్ పత్రికలు బయట పెట్టాయి. దానితో మేరీ రాజీనమా చేయాలన్న డిమాండ్ ఊపందుకోవటంతో ఆమె ఫ్రాన్స్ రేడియోలో తాను తప్పు చేశానని ఒప్పుకోక తప్పలేదు. జీవితంలో మరెప్పుడూ ప్రైవేటు విమానంలో ప్రయాణించననీ ఆమె లెంపలు వేసుకుంది. తర్వాత ఎవడు చూడొచ్చాడు కనుక!
ఫ్రాన్స్, అమెరికాలు ట్యునీషియా నియంత పాలించినంత కాలం అతనికి మంచి మిత్రులుగా మెలిగాయి. తన మాట వినని ప్రజాస్వామ్య పాలకుల కంటే దేశాన్ని గుప్పెట్లో పెట్టుకో గల నియంతే మెరుగు అన్నసూత్రాన్ని అమెరికా, ఫ్రాన్స్ లు అక్షారాలా పాటించాయి. నియంత బెన్ ఆలీ చేతిలో నుండి ట్యునీషియా ప్రజలు లేరని తెలిసాక అతన్ని వదిలేసి మరో నమ్మకస్తుడ్ని చూసుకున్నాయే తప్ప అక్కడి ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు వీసమెత్తయినా విలువ అవి ఇవ్వలేదు. ఇక అవి ఇరాక్, ఆఫ్ఘనిస్ధాన్ లలో ప్రజాస్వామ్యం స్ధాపించడానికే వాటిపై దాడి చేశామని చెప్పటం ఎంత బూటకమో అర్ధం చేసుకోవచ్చు.