లైంగిక అత్యాచారం కేసులో జులియన్ ను ఇంగ్లండ్ నుండి స్వీడన్ కు అప్పగించాలంటూ స్వీడన్ పోలీసులు బనాయించిన కేసులో వాదనలు సోమవారం ఫిబ్రవరి 7 నుండి ప్రారంభమయ్యాయి.
జులియన్ లాయర్లు రెండు ప్రధాన అంశాల మీద ఆధారపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి సాంకేతిక కారణాలు కాగా రెండోది మానవ హక్కుల ఉల్లంఘన.
స్వీడన్ పోలీసులు ఇంతవరకు జులియన్ పైన ఛార్జ్ ఏ నేరమూ మోపలేదు. లైంగిక అత్యాచారం ఆరోపణలపై అతనిని ప్రశ్నించటానికి మాత్రమే తమకు అప్పంగించాలని స్వీడన్ పోలీసులుకోరుతున్నారు. దానికోసం జులియన్ ని స్వీడన్ వరకు తీసుకెళ్ళాల్సిన అవసరం లేదనీ, ఇంటర్నెట్ ద్వారానో లేదా ఇంగ్లండ్ పోలీసుల ద్వారానోప్రశ్నించవచ్చనీ జులియన్ తరపు లాయర్లు వాదించబోతున్నట్లుగా బి.బి.సి తెలిపింది. జులియన్ ఎదుర్కొంటున్న మూడు కేసులు కూడా స్వీడన్ కు అప్పగించి తీరవలసిన నేరాలామీ కాదనేది వారి వాదన.
స్వీడన్ కి వెళ్ళాక వారు అమెరికాకు అప్పగించే అవకాశం ఉందని లేదా “గ్వాంటనామా బే” కు కూడా తరలించ వచ్చని జులియన్ ఆందోళన చెందుతున్నాడు. స్వీడన్ లో రేప్ నేరాలను రహస్యంగా జ్యురీ లేకుండా విచారిస్తారు కనుక జులియన్ పక్షపాత రహితంగా విచారణను పొందే అవకాశం లేదని జులియన్ లాయర్లు వాదిస్తున్నారు. తాను ఎటువంటి లైంగిక నేరానికి పాల్పడలేదని జులియన్ చెపుతున్నాడు. కేవలం రాజకీయ కారణాల వల్లనే తనపై తప్పుడు కేసు మోపారని అతను ఆరోపిస్తున్నాడు.
అమెరికా రాయబారుల రహస్య ఉత్తర ప్రత్యుత్తరాలను వికీలీక్స్ వెబ్ సైట్ లో ప్రచురించినందు వలన అమెరికా జులియన్ పైన చర్యలు తీసుకోవటానికి ఎదురు చూస్తున్నది. గూఢచర్యం కేసు బనాయించటానికి అమెరికా అవకాశాల కోసం చూస్తున్నది. అదే జరిగితే జులియన్ యావజ్జీవ శిక్ష అనుభవించ వలసి రావచ్చు.