ఎనోనిమస్ హ్యాకర్లు మరోసారి తమ ప్రతాపం చూపారు. ఇంటర్నెట్ లో తన కార్యకలాపాలను నిర్వహించే ఈ గ్రూపు సభ్యులు తాజాగా అమెరికా సెక్యూరిటీ సంస్ధ ” హెచ్.బి.గ్యారీ ఫెడరల్ “
వెబ్ సైట్లపై తమ ప్రతాపం చూపారు. ఆ సంస్ధ ఉన్నతాధికారుల్లో ఒకరైన ఏరన్ బార్, తాము ఎనోనిమస్ సభ్యుల్లో సీనియర్లను గుర్తించామని గత వారాంతం ప్రకటించటమే వీరి దాడికి కారణంగా తులుస్తోంది.
ఎనోనిమస్ సంస్ధలో ప్రపంచ వ్యాపితమ్గా వేలమంది కంప్యూటర్ నిపుణులు సభ్యులుగా ఉన్నారని వివిధ దేశాలు బలంగా అనుమానిస్తున్నాయి. తాము కనిపెట్టిన పేర్లను అధికారులకు, అటువంటి పరిస్ధులు ఎదురైతే తప్ప, అప్పగించబోమని బార్ పత్రికలకు తెలిపారు. ఆయన ఆ ప్రకటన చేసిన కొద్దిసేపటికే, వ్యక్తిగతం గానూ, సంస్ధ పరంగానూ టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయి. బార్ కి చెందిన ట్విటర్ ఎకౌంట్ నిండా జాతి పరమైన, లైంగిక పరమైన వ్యంగ్య వ్యాఖ్యలతో నింపేశారు. అతని మొబైల్ నెంబర్, ఫోన్ నెంబర్, సోషల్ సెక్యూరిటీ నెంబర్ తదితర వ్యక్తిగత వివరాలను కూడా ఆయన ట్విటర్ ఎకౌంట్లో పోస్ట్ చేశారు.
కంపెనీ వెబ్ సైట్ లో బార్ నుద్దేశిస్తూ “దీన్ని నువ్వే కోరి మరీ నీ నెత్తి మీదకు తెచ్చుకున్నావు, నువ్వు మర్చిపోని విధంగా పాఠం నేర్పుతాము. మళ్ళీ ఎనోనిమస్ జోలికి రాకు” సందేశాలు ప్రత్యక్షమయ్యాయి. కంపెనీకి చెందిన ఈ మెయిల్ అడ్రస్ లలో చొరబడ్డామనీ కంపెనీ ఫైళ్ళను తుడిపేశామనీ, కంపెనీ ఫోన్ వ్యవస్దకు నష్టం చేశామనీ, కంపెనీకి చెందిన డాక్యుమేంట్లను ఆన్ లైన్లో పెట్టామనీ ఎనోనిమస్ సభ్యులు తెలిపారు. ఏరన్ బార్ తమకు వెంటనే అందు బాటులోకి రాలేదని బి.బి.సి తెలిపింది. హ్యాకింగ్ కు గురయిన వెబ్ సైటు స్ధానంలో కంపెనీ తాత్కాలిక పేజీని ఉంచింది.
ఎనోనిమస్ గ్రూపు గతంలో వికీ లీక్స్ కు మద్దతుగా దాని వెబ్ సైటును మూసేసినందుకు అమెజాన్, వీసా, పేపాల్, మాస్టర్ కార్డ్ తదితర వెబ్ సైట్ లపై హ్యాకింగ్ దాడులు నిర్వహించింది. వికీ లీక్స్ వ్యవస్ధాపకుడు జులియన్ ను అరెస్ట్ చేసినపుడు ఇంటర్నెట్ లోపలా, వీధుల్లో కూడా నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. అంతే కాకుండా ట్యునీషియా, ఈజిప్టు లలో తలెత్తిన ప్రజాందోళనలకు మద్దతుగా అక్కడి ప్రభుత్వాల ఇంటర్నెట్ సర్వీసుల పైన కూడా దాడులు నిర్వహించాయి.
వికీ లీక్స్ కు మద్దతుగా దాడులు చేశాక ఎనోనిమస్ పై అనేక దేశాల ప్రభుత్వాలు విచారణను చేపట్టాయి. పశ్చిమ దేశాల్లో కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఎనోనిమస్ (Anonymous) గ్రూపు సువ్యవస్ధితమైన సంస్ధ కాదు. ఇంటర్నెట్ సందేశాల ద్వారానే ఒకరికొకరు సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ తమలో తాము ఆర్గనైజ్ అయ్యే సభ్యులతో కూడినది. ఏ కార్యక్రమమైనా ఎవరో ఒకరు ప్రారంభిస్తే నచ్చిన వాళ్ళు వెంటనే అందుకొని అనుసరించటం ఆ గ్రూపు ప్రత్యేకత. కొంతమంది ఓ పధకం ప్రకారమ్ ఆర్గనైజ్ అయ్యేవారు కూడా ఉండవచ్చు.