ఈజిప్టులో హఠాత్తుగా తలెత్తిన పరిణామాలు భారత దేశ ద్రవ్యవిధానం పైన ప్రభావం చూపుతాయని ఆర్.బి.ఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారెడ్డి ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఈజిప్టు పరిణామాలు బొత్తిగా ఊహించని విధంగా వచ్చి పడ్డాయని, జనవరి ద్రవ్య విధాన సమీక్ష తర్వాత జరిగిన ఈ పరిణామాలు సమీక్షను పూర్వ పక్షం చేశాయనీ ఆయన అన్నారు.
గత జనవరి 25 న రిజర్వు బ్యాంకు భారత పరపతి విధానాన్ని సమీక్షించి వడ్డీ రేట్లను (రెపో, రివర్స్ రెపో) 25 బేసిస్ పాయింట్లు పెంచింది. అంటే 0.25 శాతం పెంచిందన్న మాట. రెపో రేటును 6.25 శాతం నుండి 6.5 శాతానికి పెంచగా రివర్స్ రెపో రేటును 5.25 నుండి 5.5 శాతానికి పెంచింది. కేష్ రిజర్వ్ రేషియోను మార్పు చేయకుండా 6 శాతం వద్దనే ఉంచింది.
ఇండియాలో నానాటికీ పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడమే ఆర్.బి.ఐ మరియు ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ద్రవ్య విధాన సమీక్షలో గవర్నర్ పేర్కొన్నారు. విపరీతంగా పెరుగుతున్న ఆహార పదార్ధాల ధరలు, ఆయిల్ ధరలు ద్రవ్యోల్బణం పెరగటానికి ప్రధాన కారణమని సమీక్షలో పేర్కొన్నారు.
వాణిజ్య బ్యాంకులు రిజర్వు బ్యాంకు నుండి అప్పు తీసుకున్నప్పుడు ఛార్జ్ చేసే రేటును రెపో రేటు అని అంటారు. బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద డబ్బులు డిపాజిట్ చేస్తే అవి పొందే వడ్డీ రేటును రివర్స్ రెపో రేటు అని అంటారు. బ్యాంకుల ఖాతాదారుల సెకూరిటీ నిమిత్తం బ్యాంకులు ఆర్.బి.ఐ వద్ద తమ మొత్తం డిపాజిట్ల లో నుంచి తీసి ఉంచవలసిన మొత్తాన్ని కేష్ రిజర్వ్ రేషియో (సి.ఆర్.ఆర్) అంటారు.
పశ్చిమాసియా ప్రాంతం, ఉత్తరాఫ్రికా ప్రాంతం కలిసి ప్రపంచ ఆయిల్ ఉత్పత్తిలో మూడో వంతును ఉత్పత్తి చేస్తాయి. ఇండియాకు ఆయిల్ సరఫరా ఈజిప్టు మీదుగా వచ్చే పైపు లైన్ల ద్వారా కూడా జరగాలి. ఈజిప్టులో జరుగుతున్న ఆందోళనలు, అవి ఆ రెండు ప్రాంతాల్లో వ్యాపిస్తాయన్న భయాల వలన ఆయిల్ రేట్లు బ్యారల్ కు 102 డాలర్ల వరకు పెరిగింది. దాని వలన ఇండియా లో ఆయిల్ ధరలపై ప్రభావం పడుతున్నదని ఆర్.బి.ఐ గవర్నర్ సూచిస్తున్నారు.
గవర్నర్ వ్యాఖ్యలు ధరలు, ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరింతగా పెరగనున్నాయనటానికి సంకేతంగా భావించ వచ్చు. తద్వారా మరింతగా పెరగనున్న ద్రవ్యోల్బణానికి ముందుగానే ఒక కారణాన్ని గవర్నర్ సిద్ధం చేసుకుంటున్నారన్నమాట.
verry happy . i have read your articles. i understand your opineans. verry nice