ట్యునీషియాలో పోలీసు కాల్పుల్లో మరో ఇద్దరు పౌరులు చనిపోయారు. వాయవ్య ప్రాంతంలో ఉన్న కెఫ్ పట్టణంలో ఈ సంఘటన జరిగింది. పోలీసుల పెత్తనానికి వ్యతిరేకంగా స్ధానికులు పోలీసు స్టేషన్ ముందు గుమిగూడి నిరసన వ్యక్తం చేస్తుండగా పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం.
అక్కడి పోలీస్ చీఫ్ నిరసనకారులలోని ఒక మహిళను చెంపపై కొట్టాటంతో పరిస్ధితి విషమించినట్లు బి.బి.సి తెలిపింది. మహిళపై చేయి చేసుకున్నాక ప్రజలు కోపంతో స్టేషన్ పై రాళ్ళు, పెట్రోల్ బాంబులు విసరటంతో పోలీసులు కాల్పులు జరిపారని తెలిసింది. ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా చనిపోయారని అనధికార సమాచారం.
ట్యునీషియా మాజీ అధ్యక్షుడు బెన్ ఆలీని దేశం విడిచి పారిపోయేలా చేసిన అక్కడి విప్లవమే ఈజిప్టు, యెమెన్, అల్జీరియా, ఒమన్ తదితర దేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చి నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాడానికి ప్రేరణగా నిలిచిన సంగతి విదితమే.
పాత అధ్యక్షుడు పారిపోయినప్పటికీ మధ్యంతర ప్రభుత్వంలో ఇంకా అతని సహచరులు చోటు సంపాదించుకోవటం తో ట్యునీషియా ప్రజలు శాంతించలేదు. బెన్ ఆలీకి సంబంధించి ఎలాంటి అవశేషాలు మిగిలి ఉండకూడదని డిమాండ్ చేస్తూ ప్రజలు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. తాజా ప్రభుత్వం ఇంకా అమెరికా, ఫ్రాన్సుల చెప్పుచేతల లోనే ఉన్నారు.
అరెస్టు చేసిన ఇద్దరు పౌరులు చనిపోవటంతో శనివారం ఇద్దరు సైనికులను అరెస్టు చేశారు. ట్యునీషియా ఆందోళనల్లో 219 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్య సమితి తెలిపింది. అధ్యక్షుడు పారిపోయాక యూనిటీ ప్రభుత్వం పేరుతో ఒక తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని అది హామీ ఇచ్చింది. అయినా ప్రజలు ఇంకా ఆందోళనలోనే ఉన్నారు.