ఈజిప్టులో ఆందోళనకారులు ముబారక్ శుక్రవారం (ఫిబ్రవరి ౪) లోగా రాజీనామా చేయాలని గడువు విధించిన సంగతి విదితమే. తమ డిమాండును గట్టిగా వినిపించటానికి శుక్రవారం అన్ని ప్రధాన పట్టణాలలో ప్రజలు పదుల వేల సంఖ్యలో చేరుతున్నట్లుగా బిబిసి వార్తా సంస్ధ తెలిపింది. ప్రెసిడెంటు గా తానూ విసిగిపోయాననీ, కానీ తాను దిగిపోతే దేశంలో అల్లకల్లోల పరిస్థిలు ఏర్పడతాయి కనుక తాను రాజీనామా చేయబోననీ ముబారక్ ప్రకటించాడు. ఆందోళనకారుల నాయకుల్లో ఒకరైన్ అల్ బరాదీ అధ్యక్షునికి సమధానం ఇస్తూ ముబారక్ పాలన పట్ల ప్రజలూ విసిగిపోయారనీ, తాను దిగిపోతే దేశం నాశనమౌతుందని భావించడం నియంతల లక్షణమనీ పేర్కొన్నాడు.
ముస్లిం బ్రదర్ హుడ్ నాయకులు తాము అధ్యక్ష పదవికి తమ అభ్యర్ధిని పోటీకి నిలుపుతామనడంలో అర్ధం లేదనీ, ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్ధిని నిలపాలని తాము భావిస్తున్నామనీ తెలిపారు. “మాకు పౌరుల రాజ్యం కావాలి. పార్లమెంటరీ వ్యవస్థ ఉన్న ప్రజాస్వామిక వ్యవస్థ మాకు కావాలి. పార్టీలు స్థాపించుకునే స్వేచ్చ, పత్రికా స్వేచ్చ, స్వతంత్రతతో పక్షపాత రహితంగా వ్యవహరించే న్యాయ వ్యవస్థ ఉన్న రాజ్యం మాకు కావాలి అని వారు పేర్కొన్నారు.
పదుల వేల సంఖ్యలో యువకులు, స్త్రీలు, పిల్లలు ఉద్యమ కేంద్రమైన తాహ్రిరి స్క్వేర్ లో చేరి “ముబారక్! దిగిపో! దిగిపో!” అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు. డే ఆఫ్ డిపార్చర్ రోజు (దిగి పోయే రోజు) నీ ఆఖరు రోజు అని ముక్తకంఠంతో పలుకుతున్నారు. ఒక్క కైరో లోనే కాకుండా అలెగ్జాండ్రియా, రఫా, ఇస్మాలియా, జాగాజిగ్, ఆల్-మహల్లా, ఆల్-కుబ్రా, అస్వాన్, అస్యుత్ తదితర పట్టణాలలో కూడా పదుల వేలలో ప్రజలు ఊరేగింపులో పాల్గొంటున్నారు.
అనుకూల, ప్రతికూల వర్గాల మధ్య ఘర్షణలు జరక్కుండా సైన్యం ఎక్కువమంది చేరి కాపలా కాస్తున్నారు. గత రెండు రోజుల్లో ముబారక్ అనుకూల, ప్రతికూల ఆందోళనకారుల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మంది చనిపోయినట్లు ఒక మంత్రి తెలిపాడు. ఐక్యరాజ్య సమితి ఆందోళనలు మొదలైనప్పటినుండి ౩౦౦ మంది చనిపోయినట్లు అంచనా వేసింది.
ఉపాధ్యక్షుడు, ముబారక్ కు అత్యంత్ సన్నిహితుడుగా పేరుపడిన ఒమర్ సులేమాన్, తదుపరి ఎన్నికల్లో తాను పోటీ చేయనన్న అధ్యక్షుడి మాటలను గౌరవించవలసిందిగా ఓ ప్రకటనలో కోరాడు. అమెరికా, అధికారాన్ని సజావుగా, శాంతియుతంగా మార్పిడి చేయటానికి ఎలా వీలవుతుందన్న విషయాన్ని సులేమాన్ తో చర్చిస్తున్నట్లుగా వార్తలు వెలువడుతున్నాయి. ముబారక్ వెంటనే రాజీనామా చేసి మిలిటరీ మద్దతుతో సులేమాన్ నాయకత్వం లో ముగ్గురితో మూడిన రాజ్యాంగ కౌన్సిల్ కు అధికారాన్ని అప్పగించటం ఒక మార్గంగా చూస్తున్నట్లుగా సమాచారం అందుతున్నదని న్యూయర్క్ టైమ్స్ తెలిపింది. అమెరికా దీనికే మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఐతే ఇప్పుడే తనను రాజీనామా చేయమనటం ముబారక్ కు నచ్చటం లేదు. ఈజిప్టులో ఇంత పెద్ద ఎత్తున తిరుగుబాటు తలెత్తటాన్ని అమెరికా గూఢచార సంస్ధలు పసిగట్టలేక పోవటాన్ని పత్రికలు, యూరప్ దేశాలూ ఆస్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సి.ఐ.ఏ ముందుగా దీనిపై రిపోర్టు ఇచ్చిందా లేదా అని సెనేట్, కాంగ్రెస్ సభ్యులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గూఢచర్యం పై ఉన్న సెనేట్ సెలెక్ట్ కమిటీ చైర్ ఉమెన్ గూఢచార సంస్థలు తనకసలు ఈజిప్టు పైన ఏ నివేదికా ఇవ్వలేదని తెలిపినట్లుగా ఒక వార్త.
ముబారక్ మాజీనమ చేశాక ఆందోళనకారలు మరిన్ని డిమాండ్లు చేయరని నమ్మకం ఏంటని ముబారక్ మద్దతుదారులు అమెరికాను ప్రశ్నిస్తున్నారు. అమెరికా తమను మోసం చేసిందని ముబారక్ కొలువులోని మంత్రి ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ముబారక్ పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడటానికి వీలుగా మధ్యంతర ప్రభుత్వానికి అంగీకరించకుండా మరలా తనలాంటి మరో నియంతలాంటి వాని చేతికి ఆధికారం అప్పగిస్తే సైన్యానికి తాను చేస్తున్న సాయాన్ని వెంటనే నిలిపివేస్తానని అమెరికా హెచ్చరించినట్లు కూడా ఆ పత్రిక గెలిపింది. సైన్యం ఓపిక వహించటానికి కూడా అమెరికా ఒత్తిడే కారణమని టైమ్స్ కధనం.
గత గురువారం “అమ్దరినీ కలుపుకు పోయే ఆపద్ధర్మ ప్రభుత్వానికి అధికారం అప్పగించే ప్రక్రియ ప్రారంభించ వలసిందిగా” ఒక తీర్మానం చేసింది. ఈజిప్టులో రాజకీయ సంస్కరణలకు ఒత్తిడి చేస్తున్న అమెరికా ఆందోళనలుజరుగుతున్న ఇతర అరబ్ దేశాల్లో ఇదే ఫార్ములా వర్తించదని అమెరికా అంటోంది. యెమెన్, జోర్డాన్ లాంటి దేశాల్లో ఉన్న వ్యవస్థలోనే కొన్ని సవరణలు చేస్తే సరిపోతుందని అమెరికా అంచనా.