దేశంలోని టెర్రరిస్టులే ముంబై పేలుళ్ళకు బాధ్యులు కావొచ్చు -హోం మంత్రి


జులై13 తేదీన ముంబైలో చోటు చేసుకున్న మూడు వరుస పేలుళ్ల వెనక దేశంలోపలి టెర్రరిస్టు మాడ్యూల్సే బాధ్యులు అయి ఉండవచ్చని కేంద్ర మంత్రి పి.చిదంబరం గురువారం పార్లమెంటుకు తెలిపాడు. ముంబైలో మూడు చోట్ల జరిగిన వరుస పేలుళ్లలో 26 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం భారత దేశంలో తలెత్తిన టెర్రరిస్టు మాడ్యూళ్ళు ఈ పేలుళ్లకు బాధ్యులని చెప్పడానికి సూచనలు వెల్లడయ్యాయని తెలిపాడు. “ఇంకా ఒక నిర్ణయానికి రానప్పటికీ ఇప్పటివరకూ లభించిన సాక్ష్యాలన్నీ ఇండియన్ మాడ్యూల్ వైపే వేలెత్తి చూపుతున్నాయి” అని చిదంబరం చెప్పాడు.

“ఎల్లప్పుడూ నిరాకరిస్తూ జీవనం కొనసాగించలేము. నిజాలను చూడకుండా కళ్ళు మూయలేము. దేశంలో అభివృద్ధి చెందిన మాడ్యూళ్ళు ఉన్నాయి. అవి భారత మాడ్యూళ్ళు. అవి ఒక మతానికి చెందినవి కావు” అని చిదంబరం తెలిపాడు. చిదంబరం మాటల్లో “అవి ఒక మతానికి చెందినవి కావు” అన్న వ్యాఖ్య ఆసక్తిగొలుపుతోంది. కొద్ది నెలల నుండి హోం మంత్రి చిదంబరంతో పాటు దిగ్విజయ్ సింగ్ లాంటి కాంగ్రెస్ నాయకులు హిందూ టెర్రరిజం పట్ల హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. చిదంబరం రాజ్య సభలో చేసిన ఈ ప్రకటన ఆ హెచ్చరికలకు కొనసాగింపా కాదా అన్నది తెలియరాలేదు.

గత 2 సంవత్సరాలలో 51 టెర్రరిస్టు మాడ్యూళ్లను నిర్వీర్యం చేసిన సంగతిని చిదంబరం గుర్తు చేశాడు. “మనం అనేక మాడ్యూళ్లను విజయవంతంగా నాశనం చేయగలిగాం” అని చిదంబరం తెలిపాడు. ప్రపంచంలో అత్యంత సున్నితమైన పొరుగు దేశాల పక్కన మనం నివసిస్తున్నమనీ, టెర్రరిస్టు కేంద్ర పశ్చిమాసియా నుండి ఆఫ్ఘనిస్ధాన్, పాకిస్ధాన్ లకు మారిని సంగతి గుర్తించాలని చిదంబరం అన్నాడు. టెర్రరిజం కేంద్రం మన పొరుగున ఉన్నంత వరకూ మనం టెర్రరిజం నీడలోనే జీవనం కొనసాగించవలసి ఉంటుంది. మన పరిస్ధితి కూడా సున్నితంగానే తయారవుతుంది” అని చిదంబరం తెలిపాడు.

పశ్చిమాసియ టెర్రరిజానికీ, దక్షిణాసియా టెర్రరిజానికి మాతృక అమెరికా, ఇజ్రాయెల్ దేశాలన్న సంగతిని భారత పాలకులు మర్చిపోయారు. పశ్చిమాసియాలో పాలస్తీనీయుల అణచివేత కొనసాగినంతవరకూ వారి తిరుగుబాటు టెర్రరిజం రూపంలో కొనసాగుతూ ఉంటుందని రాజీవ్ గాంధీ ప్రభుత్వం వరకూ చెబుతూ వచ్చాయి. అమెరికా పంచన చేరాక కాంగ్రెస్ పార్టీ కూడా తన విధేయతను మార్చుకుంది. అందుకు చిదంబరం ప్రకటనే సాక్షీభూతం.