అమెరికా రుణ సంక్షోభం ప్రభావం ఇండియాపై ఎలా ఉంటుంది? -1


అమెరికా రుణ పరిమితి పెంపుదల, బడ్జెట్ లోటు తగ్గింపు లపై ఒప్పందం కుదిరి, ఆ మేరకు బిల్లును ప్రతినిధుల సభ, సెనేట్‌లు ఆమోదించాయి. అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా బిల్లుపై సంతకం చేసి చట్టంగా అమెరికా మీదికి, ఇంకా చెప్పాలంటే ప్రపంచం మీదికి వదిలాడు. రుణ పరిమితిని మరో 2.4 ట్రిలియన్ డాలర్లు పెంచడం ద్వారా అమెరికా అప్పులు చెల్లించలేక డిఫాల్ట్ అవుతుందన్న భయం తప్పింది. కొత్త అప్పులు చేసి పాత అప్పుల చెల్లింపులు చేయడానికి అవకాశం చిక్కింది. అలాగే దాదాపు జిడిపితో సమానంగా ఉన్న బడ్జెట్ లోటులో 2.4 ట్రిలియన్ డాలర్లు వచ్చే పది సంవత్సరాల్లో తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీసు, లోటును 2.1 ట్రిలియన్ డాలర్లు తగ్గించడానికి నిర్ణయించింది. ఒక కాంగ్రెస్ కమిటీ వేసుకుని లోటు తగ్గించేందుకు మార్గాలు వెతకమని ఆదేశించబోతున్నారు. అంటే ఏ యే రంగాల్లో ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలన్న విషయాన్ని ఆ కాంగ్రెషనల్ కమిటీ వెతికి నిర్ణయిస్తుంది.

అమెరికా రుణపరిమితి పెంపుపైనా, బడ్జెట్ లోటు తగ్గింపుపైనా ఒప్పందం కుదుర్చుకుని చట్టం చేస్తారా లేదాని ప్రపంచం అంతా ఎదురు చూసింది. ఆర్ధిక వేత్తలు, రాజకీయ పండితుల దగ్గర్నుండి షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టుకునే చిన్న చిన్న బ్రోకర్లు, వ్యాపారుల వరకూ ఉత్కంఠగా ఎదురు చూశారు. వాస్తవాని రుణ పరిమితి పెంచడం అనేది ఒక తంతులాంటి కార్యక్రమం. ఒక బిల్లు పెట్టడం, దాన్ని కాంగ్రెస్, సెనేట్ లు ఆమోదించడం సహజంగా జరిగిపోయే ప్రక్రియ. ఆర్ధిక వ్యవస్ధలో వైరుధ్యాలు తీవ్రమై సంక్షోభం చిక్కనయ్యే కొద్దీ ఒకప్పుడు చిన్న విషయాలుగా ఉన్నవి కూడా సంక్లిష్టంగా తయారవుతాయి. ప్రతిదీ వైరి పక్షాన్ని ఇరుకన పెట్టడానికి, తద్వారా లబ్ది పొందడానికీ అర్ధిక, రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తుంటాయి. తత్ఫలితమే రుణపరిమితి పెంపుపై అమెరికాలో రాజకీయ పార్టీఅల్ మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల ప్రహసనం.

ప్రపంచ ఆర్ధిక వ్యవస్ధలో అమెరికా ఆర్ధిక వ్యవస్ధ కేంద్రకం లాంటిది. అమెరికా తర్వాత యూరప్ లోని జర్మనీ, ఫ్రాన్సు, బ్రిటన్‌లు అసియాలో జపాన్ ఉప కేంద్రకాలుగా ఉంటూ వచ్చాయి. అమెరికా చుట్టూ ఈ ఉప కేంద్రాలు మొదటి వరుసలో ఉంటే, రెండవ వరుసలో ఎమర్జింగ్ దేశాలు, ఆ తర్వాత మూడో ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలు ఉంటాయి. ఒకటో వరసలో ఉండే ఆర్ధిక వ్యవస్ధలు కూడా అమెరికా కేంద్రంగా పనిచేస్తూ అమెరికాలో జరిగే పరిణామాలకు వెంటనే స్పందిస్తూ ఉంటాయి. రెండో వరసలో ఉండే దేశాల ఆర్ధిక వ్యవస్ధలు మొదటి వరస దేశాల మీదుగా అమెరికాతో సంబంధం కలిగి ఉంటాయి. కొన్ని అంశాలలో నేరుగా అమెరికాతోనే సంబంధాలు కలిగి ఉంటాయి. అదే పద్దతిలో మూడోవరస దేశాలు ఆర్ధిక వ్యవస్ధలు. ఈ నేపధ్యంలో అమెరికాలో ముఖ్యమైన ఆర్ధిక, రాజకీయ పరిణామాలు జరిగినపుడు వాటి ప్రభావం అలలు ప్రవహించినట్లుగా ఇతర దేశాలకు పాకుతుంది. అమెరీకాలో తలెత్తే పరిణామం యొక్క తీవ్రతను బట్టి అది ప్రపంచ అంతా విస్తరించేదీ లేనిదీ నిర్ణయమవుతుంది.

గత 15 లేదా 20 సంవత్సరాల నుండి నూతన ఆర్ధిక విధానాలైన సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు అమలు చేయడం ప్రారంభమయ్యాక అమెరికా, పశ్చిమ దేశాల ఆర్ధిక వ్యవస్ధలతో మిగతా ప్రపంచంలోని ఆర్ధిక వ్యవస్ధలన్నీ అనుసంధానించబడే ప్రక్రియ వేగవంతమయ్యింది. ముఖ్యంగా ప్రపంచ దేశాలన్నింటిలోని ద్రవ్య రంగాలు ఒకదానినొకటి పెనవేసుకునే ప్రక్రియ వేగవంతమయ్యింది. దాదాపు అన్ని దేశాలలోని ద్రవ్య పెట్టుబడులకు ఇతర అన్ని దేశాలలోని పెట్టుబడులతో సంబంధాలు ఏర్పడి పోయాయి. ఉదాహరణకు ద్రవ్య సంస్ధలగురించి చూస్తే వాణిజ్య బ్యాంకులు, ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ సంస్ధలు, షేర్ మార్కెట్లు, హెడ్జ్ ఫండ్ సంస్ధలు, ఛిట్ ఫండ్స్ మొదలైనవన్నీ ద్రవ్య సంస్ధలుగా కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. ప్రపంచ వ్యాపితంగా నూతన ఆర్ధిక విధానాల ఫలితంగా వివిధ దేశాల ద్రవ్య సంస్ధల మధ్య సంబధాలు అభివృద్ధి చెందాయి. ఏ కంపెనీకి ఎవరు సొంతదారో తెలియని స్ధాయిలో పీటముడులు పడి ఉన్నాయి.

అమెరికాలోని ద్రవ్య సంస్ధలు  తమలో తాము పెట్టుబడులు పెట్టుకోవడమే కాక యూరప్ ద్రవ్య సంస్ధలలోనూ పెడతాయి. అలాగే అవి యూరప్‌తో పాటు ఇతర దేశాలన్నింటా తమ బ్రాంచిలను ఏర్పాటు చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. యూరప్ దేశాల ద్రవ్య సంస్ధలు తోటి యూరప్ దేశాల ద్రవ్య సంస్ధలలోనూ అమెరికా ద్రవ్య సంస్ధలలోనూ పెట్టుబడులు కలిగి ఉంటాయి. ఎమర్జింగ్ దేశాలనుండి మూడో ప్రపంచ దేశాలు, పేద దేశాల ద్రవ్య సంస్ధలు సైతం అదే మాదిరిగా అమెరికా, యూరప్, ఎమర్జింగ్, పేద దేశాల ద్రవ్య సంస్ధలతో ఆర్ధిక సంబంధాలు కలిగి ఉంటాయి. ఈ సంబంధాలు ప్రపంచ దేశాల ద్రవ్య వ్యవస్ధను ఒక యూనిట్ కిందకి మార్చి వేశాయి. అయితే ఎమర్జింగ్ దేశాలనుండి వాటికి దిగువన ఉన్న దేశాల ద్రవ్య సంస్ధలు పూర్తిగా ప్రవేటీకరణ లేదా సరళీకరణ బారిన పడలేదు. అంటే ఆదేశాల ద్రవ్య పెట్టుబడులన్నీ పూర్తిగా ప్రవేటీకరించబడలేదు.

ఉదాహరణకి భారత దేశంలోని బ్యాంకింగ్ రంగంలో ఇప్పటివరకూ 49 శాతం వరకూ విదేశీ ప్రవేటు పెట్టుబడులను అనుమతిస్తున్నారు. స్వదేశీ ప్రవేటు బ్యాంకుల్లో కూడా విదేశీ వాటాదారు సంస్ధలకు 10 శాతానికి మించి ఓటింగ్ హక్కులు లేవు. (ఈ పరిమితిని ఎత్తివేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది). ఇన్సూరెన్స్ రంగంలో దేశీయ ప్రవేట్ కంపెనీల్లో 25 శాతం వరకు విదేశీ పెట్టుబడులను అనుమతిస్తున్నారు. మిగిలిన పెట్టుబడి తప్పనిసరిగా స్వదేశీ పెట్టుబడుదారులే పెట్టాలి. ఈ విధంగా భారత దేశ ప్రభుత్వం ద్రవ్య రంగంలో సరళీకరణ, ప్రవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను పూర్తిగా అమలు చేయకపోవడం వలన మెజారిటీ భాగం ప్రభుత్వరంగంలోనూ, లేదా స్వదేశీ ప్రవేటు పెట్టుబడిదారుల చేతుల్లోనూ ఉండిపోయింది. మెజారిటీ పెట్టుబడులు ఉంటే ప్రభుత్వం చేతుల్లోగానీ లేదా స్వదేశీయుల చేతుల్లోగానీ ఉన్నందున వాటిపైన అమెరికా, యూరప్ లలో సంభవించిన ద్రవ్య సంక్షోభం, తన ప్రభావాన్ని చూపలేక పోయింది. ప్రవేటీకరణ జరిగిన మేరకు ప్రపంచ ద్రవ్య సంక్షోభం ఇండియాపై ప్రభావం చూపగలిగింది.